జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఇక తెలుగులోనూ..  - MicTv.in - Telugu News
mictv telugu

జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఇక తెలుగులోనూ.. 

October 22, 2020

ఇంగ్లీష్ ప్రవాహంలో ఆయా రాష్రాల మాతృభాషలు నిరాదరణకు గురి అవుతున్నాయని మాతృభాషా ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జేఈఈ (మెయిన్స్) పరీక్షలపై జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై జేఈఈ పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖామంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం వెల్లడించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ), 2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. జేఈఈ (మెయిన్స్) ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పించే రాష్ట్రాల భాషను కూడా దీనిలో చేర్చుతామని వివరించారు. 

తాము ఇంగ్లీష్‌కు వ్యతిరేకం కాదని, విద్యా బోధనా మాధ్యమంగా మాతృ భాష ఉంటే భారతీయ భాషలు బలోపేతం అవడానికి దోహదపడుతుందని అన్నారు. ప్రశ్నలను అవగాహన చేసుకుని విద్యార్థులు మరింత మెరుగైన స్కోర్ సాధించేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తం అవుతుందని తెలిపారు. పీఐఎస్ఏ పరీక్షలో టాప్ స్కోరింగ్ కంట్రీస్ బోధనా మాధ్యమంగా మాతృ భాషను ఉపయోగిస్తున్నాయని ప్రధాని మోదీ ఇటీవల చెప్పగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఏ రాష్ట్రంపైనా ఏదైనా భాషను రుద్దాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. 22 భారతీయ భాషలను బలోపేతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.