ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సేవలను చంద్రుడిపై కూడా కొనసాగించనుంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో చంద్రమండలంపై భారీ ప్రాజెక్టులు కూడా నిర్మిస్తామని అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ తెలిపారు. గురువారం వాషింగ్టన్లో జరిగిన కార్యక్రమంలో బ్లూమూన్ లూనార్ లాండర్ వెహికిల్‌ను ఆవిష్కరించారు. బ్లూమూన్ ప్రాజెక్టు పేరిట రానున్న ఐదేళ్లలో చంద్రమండలం మీదకు మనుషులను పంపే టూరిజం బిజినెస్ కోసం లూనార్ లాండర్‌ను తయారు చేసింది. అమెజాన్ సంస్థకు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ స్పేస్ రీసెర్చ్ సంస్థగా ప్రయోగాలు చేపడుతోంది. అదే సంస్థ నుంచి ఈ బ్లూమూన్ ప్రాజెక్టు ముందుకు వచ్చింది.
2024 నాటికి మానవ సహిత రోవర్‌ను చంద్రుడి మీదకు పంపడమే తమ లక్ష్యమని.. నాసా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉందని తెలిపారు. అలాగే ఇదే ప్రాజెక్టులో పనిచేస్తున్న రాబర్ట్ వాకర్ అనే స్పేస్ కన్సల్టెంట్ ముందుగా 2023 నాటికి మనుషులు లేని రోవర్‌ను ప్రయోగాత్మకంగా చంద్రుడి మీదకు పంపుతామని తెలిపారు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే తమ డెలివరీ కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.