Jewelery worth Rs 247 crore stolen in London
mictv telugu

247 కోట్ల ఆభరణాలు చోరీ.. పట్టిస్తే రూ. 57 కోట్లు మీ సొంతం

July 28, 2022

లండన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ధనవంతురాలి ఇంటి నుంచి దొంగలు రూ. 247 కోట్ల విలువైన ఆభరణాలు దొంగిలించారు. ఆ దొంగలను పట్టించి ఆభరణాలు తిరిగిచ్చిన వారికి రూ. 57 కోట్ల భారీ బహుమతి ప్రకటించబడింది. బ్రిటన్ చరిత్రలోనే భారీ దొంగతనంగా భావిస్తున్న ఈ ఘటన గురించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఫార్ములా వన్ మాజీ ఎగ్జిక్యూటివ్, బిలీయనీర్ బెర్నీ ఎక్లెస్టోన్ కుమార్తె తమరా ఎక్లెస్టోన్ ఇంట్లో 31 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు 2019లో చోరీ అయ్యాయి. అప్పటినుంచి పోలీసులు దొంగల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించగా, నాలుగో వ్యక్తి కీలక నిందితుడు సెర్బియా దేశంలో తలదాచుకున్నాడు. అతడిని అప్పగించాలని లండన్ పోలీసులు కోరినా ఆ దేశం ఒప్పుకోలేదు. దాంతో ఎలాగైనా సరే తన ఆభరణాలు తిరిగిచ్చిన వారికి అందులో 25 శాతం అంటే 57 కోట్లు బహుమతిగా ఇస్తానని తమరా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘దొంగతనం జరిగినప్పటి నుంచి నా ఆభరణాలను చూడలేదు. రోజురోజుకీ ఆభరణాలు దొరుకుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఆ ఆభరణాల్లో చాలా వరకు మా కుటుంబ వారసత్వ సంపద. దయచేసి ఎవరైనా ముందుకు వచ్చి నా ఆభరణాలు కనిపెట్టి ఇవ్వండి. వారికి అందులోనే 25 శాతం వాటా ఇస్తా’నని పేర్కొంది. కాగా, ఈ చోరీపై బీబీసీ మూడు వీడియోలు రూపొందించింది.