పేరుకు వీరనారే.. కానీ సిరీస్ కాస్త బోరే - MicTv.in - Telugu News
mictv telugu

పేరుకు వీరనారే.. కానీ సిరీస్ కాస్త బోరే

October 29, 2022

సినిమాలకు తీసిపోని తీరు సిరీసులకూ ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పట్టుతప్పని కథనం, కట్టిపడేసే కథ, గుర్తుండిపోయే పాత్రలు ఉంటే ఎన్ని సీజన్లయినా ఎదురుచూస్తూ ఎంజాయ్‌ చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. మేకర్స్‌ కూడా అలాంటి సిరీసులను అందించడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు. ఓటీటీల హవా పెరిగాక పోటాపోటీగా ఈ సిరీసులూ విడుదలవుతూనే వస్తున్నాయి. అలా హాట్ స్టార్‌లో విడుదలైన లేటెస్ట్ సిరీస్‌ ఝాన్సీ. తిరు డైరెక్షన్లో అంజలి, చాందినీ చౌదరి, ఆదర్శ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లేటెస్ట్‌ సిరీస్‌ ప్రేక్షకులని ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం.
కథ, కమామిషు
ఓపెన్ అయ్యి అవడంతోనో అడవిలో ప్రయాణిస్తున్న ఝాన్సీ (అంజలి)పై కొందరు ఎటాక్ చేయడంతో తనతో పాటు ఉన్న పసికందును కాపాడుకుంటూ ఫైట్ కి దిగుతుంది. ఆ తర్వాత పసిపాపను దాచి ఫైట్ చేసే క్రమంలో గాయాలపాలై జలపాతంలో పడిపోతుంది. కట్ చేస్తే ప్యారలాల్‌గా మరోస్టోరీ. సంకీత్( ఆదర్శ్ బాలకృష్ణ) తన కూతురు మేహ అంటే ఆరోప్రాణం. తన భార్య సాక్షి(సంయుక్త) పోలీస్ ఉద్యోగంలో పడి తన కూతురిని సరిగ్గా చూసుకోవడం లేదన్న కోపంతో తనకి దూరంగా ఉంటాడు. మేహను తీసుకుని ఓసారి కేరళ టూర్‌కు వెళ్తాడు సంకీత్. అక్కడ ప్రమాదంలో పడబోతున్న పాపని ఝాన్సీ కాపాడుతుంది. ఆ తర్వాత తన గురించి ఆరా తీయగా ఆమె ఎవరో, తన గతమేంటో పూర్తిగా మరిచిపోయి అమ్నీషియా పేషెంటయిందనీ, గాయాలపాలై జలపాతం ఒడ్డున ఉండగా కాపాడామని అక్కడి ప్రజలు చెప్పడంతో, తన కూతురి ప్రాణాలు రక్షించింనందుకు కృతజ్ఞతగా ఝాన్సీని ఇంటికి తీసుకెళ్లి ఓ బోటిక్ పెట్టించి ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తాడు. కొన్నాళ్లకు ఇద్దరూ లివిన్‌లో ఉంటూ పాపను చూసుకుంటుంటారు. కానీ ఎప్పుడు సంకీత్ ఎప్పుడు పెళ్లి ప్రపోజల్‌ పెట్టినా సైలెంట్‌గా నో చెప్తుంటుంది. అప్పుడప్పుడు కలలో తన గతానికి సంబంధించిన కొన్ని స్మృతులు మెదులుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా తన గతంలోని కొన్ని సంఘటనల ప్రభావం వల్ల, కొందరు వ్యక్తులు అనుకోకుండా తారసపడడం వల్లమెల్లిగా తన గత జీవితం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి చివరికి విజయవంతమయిందా? లేదా? ఈ ప్రాసెస్‌లో తనకీ, ఫ్యామిలీకి మధ్య ఎలాంటి గ్యాప్‌ ఏర్పడింది? అనేదే అసలు కథ.

ఓవరాల్ గా సిరీస్‌ ఎలా ఉందంటే..
థ్రిల్లర్, సస్పెన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ సిరీస్‌ ఫస్ట్‌ సీజన్‌ ఆరు ఎపిసోడ్లతో సాగింది. ఫస్ట్ రెండు ఎపిసోడ్లు స్టోరీలోకి తీసుకెళ్లడానికి టైమ్‌ పట్టినా మూడో ఎపిసోడ్ నుంచి కాస్త స్పీడ్ అందుకుంది సిరీస్. బాలికలు, మహిళల మీద జరిగే అఘాయిత్యాలు, తన గతం తాలూకు షాకింగ్ నిజాల బ్యాక్‌ డ్రాప్‌తో ఒక్కో ట్విస్ట్‌ నీ ఒక్కొక్కటిగా అన్‌ ఫోల్డ్‌ చేస్తూ అక్కడక్కడా స్క్రీన్‌ ప్లే గ్రిప్పింగ్‌గానే అనిపిస్తుంది. సినిమాల్లో అందంగా, ‘ఏమో నాకలా తెలిసిపోతాయంతే’ అని అమాయకంగా కనిపించే అంజలి సీరియస్‌ యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించింది. క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుని గతాన్ని తెలుసుకోవాలని తపనపడే పాత్రలో ఒదిగిపోయింది. ఒక్కో ఎపిసోడ్‌ను ఓ ఇంట్రస్టింగ్‌ సీన్‌తో ఓపెన్ చేయడం, టైటిల్స్‌ తర్వాత గత ఎపిసోడ్‌లో చూయించిన సస్పెన్స్‌ను కంటిన్యూ చేయడం, ప్రతి ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుంది అన్న ఇంట్రస్ట్‌ క్రియేట్ చేసేలా ఎండ్ చేయడంతో ఆరు ఎపిసోడ్లు అలా సాగిపోతాయి.
మరి ఝాన్సీ గతాన్ని పూర్తిగా తెలుసుకుందా? ఈ క్రమంలో తనకొచ్చిన ఆపదలేంటి? ఎలా ఎదుర్కొంది? అమ్మాయిల జీవితాలతో ఆడుకునే మాఫియాకు బుద్ధి చెప్పిందా? సిరీస్‌ మొదట్లో తన దగ్గరున్న పసికందు ఏమైంది? అసలా పాపెవరు? తనమీద అడవిలో దాడిచేసిందెవరు? ప్యారలల్‌గా మాఫియా సంబంధిత వ్యక్తులు చేసే డీలింగ్స్‌తో తనకు సంబంధమేంటి? అన్నీ చక్కబడి చివరిగా సంకీత్‌తో పెళ్లికి ఒప్పుకుని కథ సుఖాంతమయిందా? ఇవన్నీ తెలుసుకోవాలనిపించేలా సెకండ్‌ సీజన్‌ పై ఇంట్రస్ట్‌ క్రియేట్‌ చేయడంలో సక్సెసయ్యారు తిరు అండ్ టీమ్‌.
అంతా పర్వలేదనిపించినా..
ప్రేక్షకుడు ఓ వెబ్ సిరీస్‌ని కంటిన్యూగా చూడాలంటే ఉండాల్సిన ఎలిమెంట్స్‌ని కవర్ చేస్తూ బాగానే తీసినా కొన్ని లోపాలు కూడా కనిపించకపోవు. అన్ని ఎపిసోడ్లు ఝాన్సీ పాత్ర, గతం ప్రస్తుతం చుట్టే తిరుగుతున్నా మరో ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ అయిన చాందినీ రోల్‌ మాత్రం ఈ సిరీస్‌లో పెద్దగా ఏమీ లేకపోవడం ఆడియెన్స్‌ను కాస్త డిజప్పాయింట్‌ కలిగించే విషయం. ఫైట్స్‌, యాక్షన్‌ సీన్స్‌ బాగానే చేసినా అంజలిని అక్కడక్కడా సూపర్‌ ఉమెన్‌లా చూయించే సీన్లు, ఇంత టెక్నాలజీ, సిస్టమ్‌ డవలప్‌ అయిన ఈ రోజుల్లో కూడా అనుకున్నవాళ్లని చంపేసి ఈజీగా తప్పించుకోవచ్చు అన్నట్టుండే కొన్ని సీన్లు ఆడియెన్స్‌కు అంత కన్వీన్సింగ్‌గా అనిపించవు.
మామూలుగా ఇలాంటి నేపథ్యమున్న సిరీసుల్లో స్క్రీన్‌ ప్లే కాస్త పట్టు తప్పినట్టు అనిపించినా, ఏ మాత్రం ల్యాగ్‌ ఫీలింగ్ కలిగినా ప్రేక్షకుడు ఆసక్తి కోల్పోతాడు. థియేటర్లో కూచుంటే రెండున్నర గంటల్లో ఓ సీన్లో కాకపోయినా ఓ సీన్లో అయినా ఆడియెన్స్‌ను ఎంటర్టెయిన్ చేయించొచ్చు, ఎటూ వెళ్లడు కదా అన్న ఛాన్స్‌ ఉంటుంది. కానీ సిరీసుల్లో ఆ అవకాశం ఉండదు. ప్రతి ఎపిసోడ్ లోనూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, ఊహించని సస్పెన్స్‌, పాత్రలతో కనెక్టయే ఎమోషన్స్‌ కాస్త మిస్సయినా సిరీస్‌ను స్కిప్ చేస్తాడు. ఆ రకంగా ఝాన్సీ సిరీస్‌ మరీ ప్రేక్షకుడిని కట్టిపడేసి తర్వాతి నిమిషం ఏం జరగబోతోందో అని ఉత్సుకత రేపేంత స్థాయిలో లేకపోయినా ఆరు ఎపిసోడ్లే కాబట్టి ఓ సారి అలా చూసేయొచ్చు.