ఝాన్సీ రాణి.. బ్రిటిష్ సైన్యాధికారిని ప్రేమించిందా? - MicTv.in - Telugu News
mictv telugu

ఝాన్సీ రాణి.. బ్రిటిష్ సైన్యాధికారిని ప్రేమించిందా?

February 8, 2018

ఝాన్సీ లక్ష్మీబాయి.. ఈ పేరు వింటనే పౌరుషం ఉప్పొంగుతుంది. 1857 సైనిక తిరుగుబాటు గుర్తుకొస్తుంది. భారతీయ స్త్రీ ఆత్మగౌరవానికి, పరాక్రమానికి, బలిదానానికి దేశభక్తికి ఆమె చిహ్నం. ఈ వీరనారి చరిత్రను కళ్లకు కట్టేందుకు క్రిష్ ‘మణికర్ణిక’ చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే పద్మావత్ సినిమాపై ఆరోపణలు నేపథ్యంలో ఈ మూవీపైనా విమర్శలు వచ్చాయి.

లక్ష్మీబాయికి ఒక బ్రిటిష్ సైన్యాధికారితో ప్రేమ వ్యవహారం నడిచినట్లు ఇందులో చూపారని బ్రాహ్మణ సంఘాలు మండిపడున్నాయి. ఒక ఎన్నారై రాసిన ‘రాణి’ అనే చారిత్రక నవల ఆధారంగా సినిమా తీస్తున్నారని, అందులో ఝాన్సీ రాణి గౌరవాన్నిమంటగలిపే అంశాలున్నాయని అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని మణికర్ణిక టీం చెబుతోంది. ఈ వివాదానికి కారణమైన సదరు నవలలో ఇంతకూ ఎముంది?లండన్‌లో స్థిరపడిన జయశ్రీ మిశ్రా అనే రచయిత్రి ‘రాణి’ పేరుతో రాసిన ఈ నవలను 2008లో అప్పటి యూపీలోని మయావతి ప్రభుత్వం నిషేధించింది. ఇది చరిత్ర ఆధారంగా అల్లిన కథ అని జయశ్రీ చెప్పారు. నవలలోని కథ ప్రకారం.. వారణాసిలో పుట్టిన మణికర్ణిక(ఝాన్సీ లక్ష్మీబాయి అసలు)పేరు బాల్యంలో సాధారణ ఆడపిల్లల్లా ఆడుతూ పాడుతూ ఉంటుంది. తర్వాత ఝాన్సీ రాజుతో ఆమెకు పెళ్లవుతుంది. భర్త చనిపోతాడు. ఝాన్సీలో బ్రిటిష్ రీజెంట్‌గా పనిచేస్తున్న సైన్యాధికారి, అందగాడు, బ్రహ్మచారి అయిన రాబర్ట్ ఎలిస్‌కి, రాణికి మధ్య ప్రేమ పుడుతుంది. ఇద్దరూ రోజూ కలుసుకుంటూ ఉంటారు. రాణి కష్టాల్లో ఉన్నప్పుడు ఎలిస్ ఆదుకుంటూ ఉంటాడు. రాణి యుద్ధం, ఆయుధాలు వగైరా వాటితోకాకుండా సుహృద్భావ చర్యలు, దౌత్యాలతో బ్రిటిష్ వారితో వివాదాల పరిష్కారానికి యత్నిస్తుంటుంది. యుద్ధాన్ని నివారించడానికి అన్ని దారులూ వెతుకుతుంది. తనకు సంతానం లేకపోవడంతో దత్తత తీసుకుంటుంది. అయితే బ్రిటిష్ చట్టాల ప్రకారం అలా చేయకూడదు. ఈ విషయంలో ఎలిస్ సాయం కోరుతుంది. కానీ చిన్నస్థాయి అధికారి అయిన ఎలిస్ ఏమీ చేయలేకపోతాడు.  ఎలిస్‌పై రాణికి కృతజత భావం ఉంటుంది. అతడు ఝాన్సీ నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నట్లు ఆమె భోరున విలపిస్తుంది.

అయితే మనకు దొరికిన చారిత్రకాధారాల్లోగాని, జానపదుల పాటల్లోగాని వీరి మధ్య ప్రేమానురాగాలు, స్నేహబంధాలు ఉన్నట్లు కనబడదు. రచయిత్రి కూడా ఇదంతా తన స్పకపోల కల్పితం అన్నారు. అయితే రెండు పాత్రలూ చారిత్రక వ్యక్తులవి కావడంతో వివాదం రేగింది. ఇలాంటి పాత్రల మధ్య.. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కాల్పనిక సాహిత్యం రాయొచ్చా అనే చర్చ మొదలైంది.

రాజకీయ ఉద్రిక్తతల నడుమ మానవ భావోద్వేగాల వ్యక్తీకరణమే జయశ్రీ ప్రాధాన్యం ఇచ్చారని, చరిత్రను ఉన్నదున్నట్లు కాకుండా రెండు పాత్రల మానసిక సంఘర్షణ కోణం నుంచి చూపారని పరిశోధకుడు కె. వరుణ్ నారాయణ్ పేర్కొన్నారు. ‘ఈ నవల ఆ సంకుల సమరంలో మానవతను చూపింది. రక్తపాతం, వీరగాథల నడుమ విస్మరణకు గురైన వ్యక్తుల భయాందోళలను, సంవేదనలు చిత్రించింది.. ’ అని తెలిపారు.