ఝార్ఖండ్ అటవీ ప్రాంతాల్లోని జనం గజగజ వణికిపోతున్నారు. రేయింబవళ్లు మృత్యుభయంతో దిక్కుతోచక ప్రభుత్వాన్ని శరణువేడుకుంటున్నారు. మనుషులను చంపడమే పనిగా పెట్టుకున్న ఓ మదగజం బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఓ ఏనుగు ఐదు జిల్లాల్లో గత 12 రోజుల్లో ఏకంగా 16 మందిని పొట్టనబెట్టుకుందని బాధితులు చెప్పారు. మృతుల్లో నలుగురు రాంచీ జిల్లా వారు. అక్కడి ఇటకీ బ్లాకులో ఏనుగు సంచరిస్తోందని తెలియడంతో అధికారులు 144 సెక్షన్ విధించారు.
ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయట ఐదుగురికి మించి కనిపించకూడదని హెచ్చరించారు. తెల్లారుజామున, రాత్రిపూట బయట తిరగొద్దని, ఏనుగు కనిపిస్తే భద్రంగా ఉండే చోట దాక్కోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. దాన్ని బంధించడానికి పశ్చిమ బెంగాల్ నుంచి నిపుణులను తీసుకొస్తోంది. ‘‘ఆ ఏనుగును చూద్దామని జనం గుంపులు కడుతున్నారు. దీంతో అది మరింత రెచ్చిపోతోంది. తాజాగా ఒకరు అలాగే చనిపోయారు. దాన్ని మరింత రెచ్చగొట్టకండి’’ అని రాంచీ డివిజన్ ఫార్టెస్ అధికారి శ్రీకాంత్ వర్మ సూచించారు. ఏనుగు హజారీబాగ్, రాంగఢ్, చాత్రా, లోహర్దగా జిల్లాలో పలువురు స్త్రీలను కూడా చంపింది. అది ఎందుకలా ప్రవర్తిస్తోందో పట్టుకుంటేగాని తెలియదని వైద్యులు చెబుతున్నారు.