జూకాల్లో తూటాలు.. అమ్మాయిలు ఇక మరింత సేఫ్  - MicTv.in - Telugu News
mictv telugu

జూకాల్లో తూటాలు.. అమ్మాయిలు ఇక మరింత సేఫ్ 

February 29, 2020

Ear Rings.

ఆపదలో ఉన్న మహిళలను కాపాడటానికి చెవి జూకాలు వచ్చాయి. అలంకరణకే కాదు ఆమె ఆత్మ రక్షణ కోసం ఓ యువకుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జూకాలను తయారుచేశాడు. వాటిని ధరించినవారు ఆపదలో ఉన్నప్పుడు బ్లూటూత్‌ ద్వారా తక్షణమే పోలీసులకు సమాచారం అందించేలా వాటిని తయారు చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసికి చెందిన శ్యామ్‌ చౌరాసియా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో శిక్షకుడిగా పని చేస్తున్నాడు. ఈ రోజుల్లో వరుసగా మహిళలపై దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మనోవేదన చెందిన శ్యామ్ మహిళల రక్షణకు తన వంతుగా ఏదో ఒకటి చేయాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే మహిళల కోసం భద్రతా పరికరాలను వినియోగించి పలు రకాల వస్తువులను తయారు చేసేవాడు. ఇదివరకే లిప్‌స్టిక్‌, హ్యాండ్‌ బ్యాగ్‌లలో కూడా ఇలాంటి భద్రతా పరికరాలనే తయారు చేశాడు. ఇందులో భాగంగానే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించే విధంగా అధునాతన పరికరాలతో జూకాలను తయారు చేశాడు. 

బ్లూటూత్‌ను అమర్చి ఈ జూకాలను తయారుచేశాడు. ఇవి ఫోన్‌కు అనుసంధానమై ఉంటాయి. మహిళలు ఆపదలో ఉన్న సమయంలో బటన్‌ నొక్కితే బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌కు అనుసంధానం అవుతుంది. అప్పుడు ఫోన్‌లో కన్పించే పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చు. దీంతో పోలీసులు ఆ లొకేషన్‌ను గుర్తించి అక్కడికి చేరుకోవడానికి వీలు ఉంటుంది. బ్లూటూత్‌ ద్వారా పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు కాల్‌ చేసుకునే వెసులుబాటును కల్పించాడు. ఆపద మరింత ముంచెత్తినప్పుడు రక్షణ కోసం ఇందులో తూటాను కూడా అమర్చాడు. రింగులో అమర్చిన బ్యాటరీ సహాయంతో అందులో ఉన్న తూటాను పేల్చవచ్చు. ఖాళీ ప్రదేశం వైపు మాత్రమే పేలే ఈ బుల్లెట్‌ శబ్ధం సుమారు కిలోమీటరు వరకు వినిపిస్తుంది. దీంతో బాధితులను రక్షించేందకు సమీపంలోని వారు కూడా స్పందించే అవకాశం ఉంది. శ్యామ్‌ తయారుచేసిన ఈ జూకాలు విద్యార్థినులు, మహిళలకు ఎంతో భద్రత కల్పిస్తాయని స్థానికులు అంటున్నారు.