Jio 5G services fully available in Gujarat
mictv telugu

జియో 5జీ సేవలు పూర్తిగా పొందిన తొలి రాష్ట్రంగా రికార్డు

November 25, 2022

దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రైవేటు టెలికాం కంపెనీలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రంగంలో మిగతా కంపెనీలతో పోలిస్తే రిలయన్స్ జియో దూసుకుపోతోంది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై, బెంగళూరులలో అందుబాటులోకి వచ్చిన 5జీ క్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది. వచ్చే ఏడాది కల్లా దేశంలోని అన్ని మండలాలకు 5జీని విస్తరిస్తామని జియో ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా జియో 5జీ నెట్ వర్క్ పరంగా ఘనత సాధించింది.

దేశంలో గుజరాత్ రాష్ట్రం మొత్తం 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో ఈ సేవలు పొందిన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ట్రూ 5జీ ఫర్ ఆల్ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో వంద శాతం ట్రూ 5జీ సేవలను అందించనుంది. శుక్రవారం నుంచి ఈ సేవలను వినియెగదారులు పొందగలుగుతారని కంపెనీ ప్రకటించింది. ఎలాంటి అదనపు రుసుం లేకుండా 1 జీబీపీఎస్ తో అపరిమిత డేటా పొందవచ్చని జియో తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ అధినేత ఆకాశ్ అంబానీ తెలియజేస్తూ గుజరాత్ ప్రజలకు అభినందనలు తెలిపారు. కాగా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ప్రధాని నరేంద్ర మోదీలది గుజరాత్ స్వస్థలమని తెలిసిందే. త్వరలో అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జియో తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.