సుప్రీం కోర్టు తీర్పుతో పడిన భారాన్ని టెలికం సంస్థలు కస్టమర్లకు వడ్డిస్తున్నాయి. డిసెంబర్ నుంచి టారిఫ్ పెంచుతామని వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ప్రకటించడం తెలిసిందే. ఇప్పటికే ఐయూసీ చార్జీల పేరుతో వాత పెట్టిన రియలన్స్ జియో కూడా మరో వాతకు సిద్ధమైనంది. కోర్టు తీర్పు, ట్రాయ్ నిబంధనల ప్రకారం త్వరలో ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
అయితే డేటా వినియోగంపై తీవ్ర ప్రభావం ఉండదని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెంపు ఉంటుందని తెలిపింది. *ఇతర ఆపరేటర్లలా మేం కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు టెలికం పరిశ్రమను బలోపేతం చేయడానికి ట్రాయ్ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాం. డేటా వినియోగం, డిజిటలైజేషన్‌కు ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా కొన్ని వారాల్లో టారిఫ్‌ను పెంచుతాం..’ అని చెప్పుకొచ్చింది. జియో ఇప్పటికే నాన్-జియో కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టారిఫ్ ధరలు కూడా పెరిగితే దానికి, ఇతర కంపెనీలకు తేడా లేకుండా పోతుంది. స్పెక్ట్రం వాడకం, లైసెన్సు ఫీజుల కింద టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ. 92 వేల కోట్లు చెల్లించాలి సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించడం తెలిసిందే. ఈ భారానికి టెలికం కంపెనీల నష్టాలు కూడా తోడై దెబ్బ ప్రభావం కస్టమర్ల వీపుపై పడుతోంది.