అందరూ ఎదురు చూస్తున్న జియో ఫ్రీ ఫోన్ బుకింగ్ గురువారం నుంచి మొదలుకాబోతోంది. జియో పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ ను ఉచితంగా ఇస్తామని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఇది ఫ్రీ ఫోనే అయినా వినియోగదారులు మొదట రూ. 1,500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఈ డబ్బును వాపసు చేస్తారు.
ఈ ఫోన్ కోసం ఆఫ్‌లైన్, ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు. ఆ సమయంలో పేరును, ఇతర వివరాలను మాత్రం నమోదు చేస్తే సరిపోతుంది. ఫోన్ మీ చేతికి అందాక రూ.1500 డిపాజిట్ చేయాలి. ఆఫ్ లైన్ విధానం కింద.. జియో ఔట్ లెట్లలో, లేదా జియో ఫోన్లను అమ్మే షాపుల్లో బుకింగ్ చేసుకోవాలి. ఆధార్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక ఆధార్ నంబర్ పై ఒక ఫోన్ మాత్రమే ఇస్తారు. వివరాలను నమోదు చేసుకున్న తర్వాత టోకన్ నంబర్ ఇస్తారు. ఫోన్ ను డెలివరీ చేసే సమయంలో దీన్ని అడుగుతారు. ఫ్రీ ఫోన్ కోసం జియో.కామ్ లేదా జియో ఫ్రీ ఫోన్.ఆర్గ్ సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవాలి. ఫ్రీ మొబైల్ ఫోన్ రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసి, పేరు, ఇతర వివరాలు, ఆధార్ నంబర్, చిరునామా ఇవ్వాలి. మొదట వచ్చిన వారికి మొదట( ఫస్ట్ కం ఫస్ట్ సర్వీస్) విధానంలో ఫోన్లు అందిస్తారు. సెప్టెంబర్ నెలాఖరికి ఫోన్ డెలివరీ అవుతుంది.