జియో 4 జీ ఫోన్ ఫ్రీ...అంతేకాదు అదిరిపోయే ఆఫర్లు - Telugu News - Mic tv
mictv telugu

జియో 4 జీ ఫోన్ ఫ్రీ…అంతేకాదు అదిరిపోయే ఆఫర్లు

July 21, 2017

జియో మరో సంచలనానికి తెర తీసింది. 4జీ ఫోన్ ను జీరో ప్రైస్ కే ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత 4జీ ఫోన్ తో పాటు ఫ్రీ కాల్స్ , అన్ లిమిటెడ్ డేటా ఆఫర్లను ఇవ్వబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కొత్త 4జీ ఫీచర్ ఫోన్ ను లాంచ్ చేశారు. ఆగస్టు పదిహేను కల్లా ఈ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.మరోవైపు జియో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ను మించిపోయింది.

ముంబయిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నలభై ఏళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎంతో ఎదిగిందని ఆ సంస్థ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ అన్నారు. 40 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఉన్న 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను ఇండియ‌న్స్ అంద‌రికీ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 15న ఈ ఫీచ‌ర్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తేనున్నారు. ఆగ‌స్ట్ 24 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయ‌ని తెలిపారు. అయితే ఉచితాన్ని మిస్ యూజ్ చేయొద్ద‌న్న కార‌ణంగా రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్న‌ట్లు అంబానీ చెప్పారు. దీనిని మూడేళ్ల త‌ర్వాత తిరిగి చెల్లిస్తామ‌ని అంబానీ చెప్పారు. ఈ 4జీ ఎల్‌టీఈ ఫోన్ మొత్తం వాయిస్ క‌మాండ్స్‌తోనే ప‌ని చేస్తుంది. ఫోన్ చేయాల‌న్నా.. మెసేజ్ పంపాల‌న్నా.. జియో యాప్స్‌ను యూజ్ చేయాల‌న్నా అన్నీ వాయిస్ క‌మాండ్స్‌తోనే ఈ ఫోన్ ప‌ని చేస్తుంది. దేశంలోని అన్ని భాష‌ల‌ను ఈ ఫోన్ అర్థం చేసుకుంటుంది. ఈ డెమోను అంబానీ కూతురు ఇషా, ఆకాశ్ అందించారు.

ముకేష్ మాట్లాడుతూ ‘జియోలో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం. 170 రోజుల్లోనే వంద మిలియన్లకు పైగా వినియోగదారులు జియోలో చేరారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను ఆకర్షిస్తున్నాం.జియో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ కంటే వేగంగా వృద్ధి చెందుతోంది. జియో కస్టమర్లు నెలకు 250కోట్ల డేటాను వినియోగిస్తున్నారు. 165కోట్ల గంటల హైస్పీడ్‌ వీడియోలు చూస్తున్నారు. జియో రాకతో భారత్‌ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను మించిపోయింది. జియోను వచ్చే 12 నెలల్లో 99శాతం జనాభాకు చేరువ చేస్తాం. దేశంలో వినియోగిస్తున్న 78కోట్ల ఫోన్లలో 50శాతం ఫీచర్‌ ఫోన్లే. వాటి వినియోగిస్తున్న వారికి డేటా కొరత రాకూడదన్న ఉద్దేశంతోనే అపరిమిత డేటా అందిస్తున్నాం.’ అని వివరించారు.

ముఖేష్ అంబానీ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన తల్లి కోకిలా బెన్‌ భావోద్వేగానికి గురయ్యారు. రిలయన్స్‌ సంస్థ 40 ఏళ్ల ప్రగతిని తన తండ్రి ధీరూభాయ్‌ అంబానీకి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ఇన్వెస్టర్లు లేచి నిలబడి ‘ధీరూభాయ్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.