జియో సంచలనం..సినిమా రిలీజైన రోజే ఇంట్లో.. - MicTv.in - Telugu News
mictv telugu

జియో సంచలనం..సినిమా రిలీజైన రోజే ఇంట్లో..

August 12, 2019

Jio Phone 3.

ఈరోజు జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ కొన్ని కీలక ప్రకటనలు చేసారు. రిలయన్స్‌ తీసుకొస్తున్న జియో ఫైబర్‌ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 5 నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుంది. అదే రోజున జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 1600 నగరాలు, 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ సేవలను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

తరువాత స్టేజ్ పైకి వచ్చిన ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాష్ అంబానీ జియో ఫైబర్‌ విశేషాలను వివరించారు. జియో ఫైబర్ ద్వారా 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు డేటా అందిస్తామని తెలిపారు. జియో ఫైబర్ సేవలు ప్రజలందరికీ అందుబాటు ధరల్లో నెలకు రూ.700 నుంచి రూ.10వేల వరకు ఉంటాయని వెల్లడించారు. ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చని తెలిపారు. ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’గా పిలిచే ఈ సేవలను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తమన్నారు. జియో ఫైబర్‌ ద్వారా భారత్‌లోని ఏ టెలికాం ఆపరేటర్‌కైనా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ ఉచిత సేవలు జీవితకాలం ఉంటాయి ప్రారంభ ఆఫర్‌ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్‌ తీసుకునే జియో ఫైబర్‌ కస్టమర్లు హెచ్‌డీ/4కే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్సును ఉచితంగా తీసుకోవచ్చని తెలిపారు.