కశ్మీర్‌లో ఉగ్ర లింకులున్న 300 పాఠశాలలపై నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లో ఉగ్ర లింకులున్న 300 పాఠశాలలపై నిషేధం

June 15, 2022

ఉగ్రవాద సంస్థ అయిన జమాత్‌-ఇ-ఇస్లామీ కనుసన్నల్లో నడుస్తున్న ఫలాహ్‌-ఇ-ఆమ్‌ ట్రస్ట్‌ (FAT) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్లను నిషేధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. సదరు ట్రస్ట్.. ప్రభుత్వ భూముల ఆక్రమణ, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, మోసాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. దాదాపు 325 విద్యాసంస్థలన్నీ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి స్కూళ్లను స్థాపించినట్లు, ఫోర్జరీలతో ఫేక్‌ డాక్యుమెంట్లను సృష్టించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలో ఆ ట్రస్ట్ లోని స్కూళ్లపై నిషేధం విధించాలని ఉత్తర్వులను జారీ చేసింది.

ఇక ఎఫ్‌ఏటీ అనుబంధ పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బీకే సింగ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల్లోగా ఆయా పాఠశాలలకు సీల్ వేయాలని వివిధ జిల్లాలకు చెందిన విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధిత పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 11 వేల మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని విద్యాశాఖ సూచించింది. దీంతో ఎఫ్‌ఏటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లోని టీచర్లు, ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. ఎఫ్‌ఏటీ నిషేధిత విద్యా సంస్థల్లో కొత్త అడ్మిషన్లు చేపట్టరాదని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని విద్యాధికారులను ఆదేశించింది.