శభాష్ ఉమేశ్.. పుల్వామా అమరుల కోసం 61000 కి.మీ. - MicTv.in - Telugu News
mictv telugu

శభాష్ ఉమేశ్.. పుల్వామా అమరుల కోసం 61000 కి.మీ.

February 14, 2020

Umesh Gopinath Jadhav.

కొందరు తమ దేశం పట్ల ప్రేమను వినూత్నంగా ప్రదర్శిస్తారు. ఎన్నో ఇచ్చిన తన దేశానికి ఈ విధంగా తన భక్తిని చాటుకుంటాం అంటారు. ఈ పెద్దయన ఓ గాయకుడు.. అంతమాత్రన తన వృత్తికే పరిమితమైపోలేదు. అంతకుమించి దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకోవాలనుకున్నాడు. పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది వీర జవాన్ల కుటుంబాలను కలుసుకోవాలని సంకల్పించాడు. వారంతా ఎక్కడెక్కడో ఉంటారు. అందరి చిరునామాలు కనుక్కున్నాడు. ప్రయాణం మొదలుపెట్టాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 61వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆ కుటుంబాలను కలిసి వారి ఆవేదనను తెలుసుకున్నాడు. దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో 61 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం చేశాడు. బాధిత కుటుంబాలను కలిసి వారి ఇంటి ముందు, సైనికులను దహనం చేసిన చోట మట్టిని సేకరించాడు. పుల్వామా ఘటన జరిగి నేటికి ఏడాది కావడంతో లెత్ పొరాలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో జవాన్ స్మారకార్థం ఏర్పాటుచేసిన స్థూపం వద్ద తాను సేకరించి తీసుకెళ్లిన పవిత్ర మట్టిని ఉంచి నివాళులు అర్పించాడు. 

ఆ పెద్దాయన పేరు ఉమేశ్ గోపీనాథ్ జాదవ్. ఆయనది బెంగళూరు. గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పాక్ ఉగ్రవాదులు బలి తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఉమేశ్ గోపీనాథ్ భిన్నంగా వారికి నివాళులు అర్పించాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై ఉమేశ్ గోపీనాథ్ మాట్లాడుతూ.. పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలను కలుసుకోవడం తాను గర్వంగా భావిస్తున్నానని చెప్పాడు. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించడమే తన ముఖ్య ఉద్దేశం అని వివరించాడు. సైనికులను గౌరవించే క్రమంలో ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే అని గోపీనాథ్ వెల్లడించాడు