భారతదేశమే ముస్లింలకు సురక్షితం.. సూఫీ నేత - MicTv.in - Telugu News
mictv telugu

భారతదేశమే ముస్లింలకు సురక్షితం.. సూఫీ నేత

October 14, 2019

ముస్లింలు నివసించడానికి భారతదేశమే అత్యుత్తమ ప్రదేశం అని సూఫీ ముస్లిం నేత నసీరుద్దీన్ చిష్తీ అన్నారు. పాకిస్తాన్ అబద్ధపు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ముస్లింలకు భారత్‌కు మించిన మంచి దేశం వేరేది లేదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అన్న ప్రచారంపై పరిశీలనకు వెళ్లింది సూఫీ ముస్లిం బృందం. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. 

సోమవారం ఉదయం ఆ బృంద సభ్యుడైన నసీరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జిహాద్‌కు పిలుపునివ్వడం దుర్మార్గం. ముస్లింల హక్కులపై పాకిస్తాన్‌కు అంత ఆసక్తి ఉంటే చైనా, పాలస్తీనాల్లో పోరాడాలి. ఇక్కడి ముస్లింలకు ఇమ్రాన్ సలహాలు అక్కర్లేదు. జమ్ము కశ్మీర్‌లో స్థానికులతో మేము మాట్లాడాం. ఎక్కడా ఒక్కరు కూడా మాకు మానవ హక్కులకు భంగం కలిగినట్లు ఫిర్యాదు చేయలేదు. ఫోన్ కమ్యూనికేషన్ వంటి సౌకర్యాలను నిలుపుదల చేయడం వాస్తవమే. అయితే ఆర్టికల్ 370 రద్దు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని కఠిన చర్యలు తప్పవు’ అని నసీరుద్దీన్ అన్నారు.  

India ..

ఇదిలావుండగా హిందువుల వల్లే దేశంలోని ముస్లింలు అందరూ సంతోషంగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఒడిశాలో జరిగిన ‘కార్యకారీ మండల్’ వార్షిక సమావేశంలో పాల్గొన్న భగవత్ మాట్లాడుతూ.. హిందూ అనేది ఓ మతం కాదని, అది దేశ ప్రజల సంస్కృతి అని తెలిపారు. దేశంలోని పార్సీలు తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడానికి, ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మనం హిందువులం కాబట్టేనని భగవత్ తెలిపారు. కాగా, ఆయన వ్యాఖ్యలను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొట్టిపారేశారు. హిందూయిజానికి అన్వయించి భారత్‌లో ముస్లింల సంస్కృతి, విశ్వాసాన్ని దిగజార్చలేరని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇతర దేశాల ముస్లింలతో పోల్చి ఇక్కడి ముస్లింల భారతీయతను తగ్గించలేరని ఘాటుగా సమాధానం ఇచ్చారు.