జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం అర్థరాత్రి జిల్లాలోని బాలాకోట్ సెక్టార్లో ఉగ్రవాదులు హతమైనట్లు వారు తెలిపారు. ఒక ఫార్వర్డ్ గ్రామం వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న వారిపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వారు స్పష్టం చేశారు. ఈ ఉదయం సైన్యం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు.
మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తిని జమ్మూలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడం వల్ల ఆదివారం ఉదయం చనిపోయాడు. అతని మృతితో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది.