ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు సర్వేపై తీర్పునిచ్చిన సివిల్ జడ్జి తన స్వీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘పిటిషన్ దారులు భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. దీని వల్ల సివిల్ కేసుగా ఉన్న ఈ అంశం అసాధారణ కేసుగా మారింది. దీంతో నా కుటుంబ సభ్యులు నా భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. నేను ఇంటినుంచి బయటికి వచ్చేటప్పుడు నా భార్య పదేపదే నా భద్రత గురించి హెచ్చరిస్తోంది. నేను కూడా నా కుటుంబ సభ్యుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నాను’ అని జడ్జి రవికుమార్ దివాకర్ పేర్కొన్నారు.
కాగా, కాశీ విశ్వనాథ్ ఆలయం సమీపంలో ఉన్న మసీదులో సర్వే జరపించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన దివాకర్.. అందుకు అంగీకరిస్తూ కమిషనర్‌తో కూడిన ఓ కమిటీని నియమించారు. ఈ క్రమంలో మే 7న జరిపిన సర్వేలో మసీదు వద్ద హిందూ ఆలయానికి చెందని ఆనవాళ్లు, స్వస్తికలు బయటపడ్డాయి. దీంతో సర్వేను నిలిపివేయాలని, సర్వే కోసం కోర్టు నియమించిన కమిషనర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మసీదు కమిటీ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మే 11న విచారించిన కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. వీడియో సర్వే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అటు మే 17 (మంగళవారం) వరకు సర్వే పూర్తి చేయాలని కమిటీని కోర్టు ఆదేశించింది.