జేఎన్‌యూకి మోదీ పేరు పెట్టాలి.. బీజేపీ ఎంపీ
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి ప్రధాని నరేంద్రమోదీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ ప్రతిపాదించారు. యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి మోదీ ఎంతో చేశారని, జేఎన్‌యూకు కూడా ఎంతో చేశారని అన్నారు.
అందుకే మోదీ పేరు వచ్చే విధంగా ‘మోదీ నరేంద్ర యూనివర్సిటీ’ (ఎంఎన్‌యూ) అని పేరు పెట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘మన పూర్వీకులు చేసిన తప్పిదం కారణంగా ఇవాళ ఈ పరిస్థితులు ఎదుర్కుంటున్నాం. కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాను. గతంతో పోలిస్తే జేఎన్‌యూ ప్రాంగణంలో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలు వినిపిస్తున్నాయి. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’ అని హన్స్‌రాజ్ తెలిపారు.
అనంతరం ఎంపీ, ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ పేరు మార్పు ఆయన వ్యక్తిగత విషయమని, మోదీ పట్ల ఉన్న గౌరవాన్ని ఆయన చాటుకున్నారని అభిప్రాయపడ్డారు.