Job Notificatons In Telangana
mictv telugu

వరుసగా ఉద్యోగ ప్రకటనలు…సర్కార్ వ్యూహం ఇదే..!

December 3, 2022

Job Notificatons In Telangana

తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. గురుకులాల్లో 12 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగుల్లో జోష్ పెరిగింది. ఎన్నికల నాటికి అన్నిశాఖల్లో ఖాళీల్ని భర్తీ చేయాలని సర్కార్ సన్నద్దమవుతోంది.ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 నోటిఫికేషన్లు ఇచ్చింది. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తారా?ఉద్యోగాల భర్తీ వెనుక సీఎం కేసీఆర్ వ్యూహమేంటి?

ఉద్యోగాల జాతర

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతోంది. పోలీస్ ,గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇప్పటికే వచ్చాయి. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఇప్పటికే జరగ్గా మొన్న గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పలు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పోలీస్ శాఖలో 17 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పుడు గురుకులాల్లో 12 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.ఈ ఏడాది డీఎస్సీ కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ఎన్నికలకు ముందే అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుంది.

నిరుద్యోగుల్లో ఉత్సాహం

తెలంగాణ వచ్చాక ఉద్యోగాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు.తెలంగాణ ప్రభుత్వం తొలి టర్మ్‌లో నోటిఫికేషన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. పోలీస్ ఉద్యోగాల భర్తీ తప్ప మిగతా అన్ని కొలువులు భర్తీ అంతంతమాత్రంగానే జరిగింది. సెకండ్ టర్మ్‌లో కేసీఆర్ ప్రభుత్వం వేగం పెంచింది. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చేస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టుల్ని గుర్తించి ఆర్థికశాఖ అనుమతి వచ్చేలా చూస్తోంది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈలోపే అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది.

ఎన్నికలకు ముందే

వరుస ఉద్యోగ ప్రకటనల వెనుక మతలబు ఉంది.ఎన్నికలనాటికి నిరుద్యోగుల్ని బిజీగా ఉంచాలి. రాజకీయాలపై ఆలోచించకుండా చదువులో మునిగిపోయేలా చేయాలి.వారిలో ప్రభుత్వంపై సానుకూలత వచ్చేలా ప్రయత్నాలు చేస్తుంది. తొలి టర్మ్ లో ఎదురైన సెగను ఇప్పుడు లేకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. వరుస పెట్టి ఉద్యోగ జాతరకు తెరతీసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇప్పటికే నిర్వహించింది. గ్రూప్ 4 కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మిగతా గ్రూప్ నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది నిరుద్యోగులకు పండుగ. పుస్తకాల దుమ్ము దులిపి సిలబస్ పట్టి జాబ్ కొట్టాలి.