ఏపీ: సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ఉద్యోగం: కలెక్టర్ కృతికా శుక్లా - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ: సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ఉద్యోగం: కలెక్టర్ కృతికా శుక్లా

June 21, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అపర్ణకు సోమవారం కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ, నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, కారుణ్య నియామక ఉత్వర్వులను జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతరావుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

కాకినాడ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు గతకొన్ని రోజులక్రితం తన వద్ద కారు డ్రైవర్‌గా విధులు నిర్వహించిన సుబ్రమణ్యంను హత్యచేసి, తెల్లవారుజామున 2 గంటల సమయంలో మృతదేహాన్ని తన కారులోనే తీసుకొచ్చి అతని తల్లిదండ్రులకు అప్పగించిన విషయం తెలిసిందే. దాంతో సుబ్రమణ్యంను హత్య చేసింది అనంతబాబే అని తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనంతబాబును అదుపులోకి తీసుకొని విచారించగా, తానే ఆ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అనంతబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సోమవారంతో రిమాండ్ గడువు ముగియడంతో అతడిని పోలీసులు రాజమహేంద్రవరం కోర్టులో ప్రవేశపెట్టగా, జులై 1 వరకు రిమాండును పొడిగిస్తూ, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో అనంతబాబు చేతిలో హత్య చేయబడ్డ సుబ్రమణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని బంధుమిత్రులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఘటనపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి.. సుబ్రమణ్యం కుటుంబానికి ఆర్థిక సహాయంతోపాటు, ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే.. సోమవారం కాకినాడ కలెక్టర్ సుబ్రమణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ, నియామకపత్రాన్ని అందజేశారు.