కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వేస్తారా? వేయారా? అని ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఆయన ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..”భవిష్యత్‌లో ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇంటర్వ్యూ లేకుండా చేశాం. వ్రాత పరీక్షల ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తాం. 500పైగా గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్స్ త్వరలోనే విడుదల చేస్తాం. గ్రూప్ 1లో కూడా 95శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా కేసీఆర్ ఇదివరకే జీవో విడుదల చేశాడు. ఈ ఘనత కేసీఆర్‌దే” అని హరీష్‌రావు రావు అన్నారు.
అనంతరం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న 15 లక్షల 65 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు లక్షల ఉద్యోగాలు రైల్వేలో ఖాళీగా ఉన్నాయని, బీజేపీ నేతలను ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే, బీజేపీ నాయకులకు పాలాభిషేకం చేస్తామని హరీష్ రావు అన్నారు.