కొత్త లొల్లి : చైనా దాడి చేస్తే తైవాన్‌ను కాపాడతాం.. అమెరికా - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త లొల్లి : చైనా దాడి చేస్తే తైవాన్‌ను కాపాడతాం.. అమెరికా

May 23, 2022

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత అదే రీతిలో చైనా తైవాన్‌పై దాడి చేయవచ్చని అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే జరిగితే గతంలో చెప్పినట్టు తైవాన్‌కు అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు బైడెన్ జపాన్ వచ్చారు. మన ప్రధాని మోదీ కూడా జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత బైడెన్ ఆసియా పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తైవాన్‌పై అమెరికా వైఖరిని ప్రశ్నించగా, ఆయన పై విధంగా స్పందించారు. అంతేకాక, వన్ చైనా పాలసీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వన్ చైనా పాలసీకి మేం గతంలో అంగీకరించాం. కానీ, దానిని బలవంతంగా తీసుకొచ్చారు. అందులో పేర్కొన్న నియమ నిబంధనలు సరిగ్గా లేవు. అసలు ఆ ఆలోచనే సరిగ్గాలేదు. తైవాన్ తనను తాను రక్షించుకునే మార్గాలకు అమెరికా సహకారం అవసరం. దీంతోపాటు సముద్ర రక్షణలో క్వాడ్ దేశాల భాగస్వామ్యంతో ఈ ప్రాంతంలో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తామ’ని వెల్లడించారు. ఇదిలా ఉండగా, వన్ చైనా పాలసీపై మారిన అమెరికా వైఖరిపై చైనా మండిపడుతోంది.