Joe Biden hails Air India-Boeing deal
mictv telugu

10 లక్షల మంది అమెరికన్లకి ఉద్యోగాలిస్తున్న భారత్‌కి థ్యాంక్స్ : బైడెన్

February 15, 2023

Joe Biden hails Air India-Boeing deal

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చక్రం మాదిరి తిరుగుతూ ఉంటుంది. ధనవంతుడు ఎప్పుడూ ఒకేలా ఉండడు అలాగే పేదవాడు కూడా. ఒకే తరంలో కాకున్నా కొన్ని తరాత తర్వాత అయినా బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవడం ఖాయం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. దీనికి సజీవ తార్కాణంగా తాజా పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు దేశాన్ని దోచుకున్న బ్రిటన్ నేడు భారత్‌తో వాణిజ్యం చేస్తూ భారీ ఎత్తున డాలర్లు సంపాదిస్తోంది. అలాగే అగ్రరాజ్యం అమెరికా కూడా.

ఒకప్పుడు ఆర్ధిక అవసరాల కోసం అమెరికా వంటి దేశాల మీద ఆధారపడిన భారత్.. ఇప్పుడు ఏకంగా అమెరికన్లకే ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరింది. మాంద్యం దెబ్బకు కుదేలవుతున్న ప్రధాన పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్‌లకు నేడు భారతదేశం ఇచ్చే వ్యాపార అవకాశం పెద్ద వరంగా మారింది. వివరాల్లోకెళితే.. నష్టాల్లో ఉన్న ఎయిరిండియా సంస్థను గతేడాది టాటా గ్రూప్ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ విస్తరణపై దృష్టి సారించిన టాటా గ్రూప్ భారీ సంఖ్యలో విమానాలకు ఆర్డర్ ఇచ్చింది.

ఈ మేరకు ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో 220 విమానాలు, 250 ఎయిర్ బస్ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 46 బిలియన్ డాలర్లు. దీని ద్వారా అమెరికాలోని 44 రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు రానున్నాయి. వీరిలో చాలా మందికి నాలుగేళ్ల డిగ్రీ కూడా అవసరం లేనివి ఉన్నాయి. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రకటించి రెండు దేశాల మధ్య ఉన్న ఆర్ధిక భాగస్వామ్యానికి నిదర్శనమని ప్రశంసించారు.

అనంతరం ప్రధాని మోదీలో టెలిఫోన్లో మాట్లాడారు. ఇదొక చారిత్రాత్మక ఒప్పందమని అభివర్ణించారు. అటు 250 ఎయిర్ బస్‌లను తయారు చేసే ఎయిర్ బస్ సంస్థ ఫ్రాన్స్ కంపెనీ అయినప్పటికీ తయారీ అంతా కూడా బ్రిటన్‌లో జరుగుతుంది. దీంతో తమ దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు ఆర్ధిక వ్యవస్థలోకి నిధులు భారీగా వస్తాయని, ఆర్ధిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌తో కలిసి వెళ్లడం బ్రిటన్‌కి లాభిస్తుందని ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. కాగా, మాంద్యం భయాలు వెంటాడుతున్న, జీడీపీ క్షీణిస్తున్న వేళ అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా ఇచ్చిన ఆర్డర్ భారీ ఉపశమనంగా భావిస్తున్నారు.