రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ దేశానికి పాశ్చాత్య దేశాలు ఆర్ధిక, ఆయుధ సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అదే లేకపోతే ఉక్రెయిన్ ఎప్పుడో రష్యా వశమయ్యేది. యుద్ధం మొదలై ఇప్పటికే ఏడాది కావస్తున్న సమయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి ఆ దేశంలో పర్యటించారు. సోమవారం ఆయన రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ డుడాతో సమావేశమయ్యేందుకు ఆ దేశం వెళ్తూ మార్గమధ్యంలో ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయ్యారు.
ఈ సందర్భంగా జెలెన్ స్కీతో భేటీ అయి 500 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించారు. దీంతో పాటు సుదీర్ఘ శ్రేణి ఆయుధాలపై చర్చించినట్టు జెలెన్ స్కీ వెల్లడించారు. అంతకుముందు కీవ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా రాజధాని కీవ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఎవరో ప్రముఖ నేత పర్యటించబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ బైడెన్ వస్తారని ఎవరూ ఊహించలేకపోయారు.