ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ‘30 అండర్ 30 ఏషియా క్లాస్ ఆఫ్ 2022’ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల గణిత మేధావి జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్ చోటు దక్కించుకున్నారు. ఆసియాలోని వ్యాపార, సమాజ భవిష్యత్ అనే అంశంపై.. ఒక్కో విభాగం నుంచి 30 మంది చొప్పున, 10 విభాగాల్లో కలిపి 300 మందిని ఎంపిక చేయగా వారిలో భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. లెక్కలపై వివిధ దేశాల విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో 2020లో ‘భాన్జు’ అనే కమర్షియల్ ఎడ్టెక్ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేసినందుకు గానూ ఇందులో చోటు లభించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘భాంజూ’ అనే ఈ స్టార్టప్ ద్వారా… పిల్లలు ఎలాంటి భయం లేకుండా సునాయాసంగా లెక్కలు నేర్చుకోవచ్చని భానుప్రకాశ్ చెబుతున్నారు. ‘భాంజూ’ పద్ధతిలో అభ్యసిస్తే, విద్యార్థులు వేగంగా, మెరుగ్గా లెక్కలు చేయగలరని అంటున్నారు.
2021 జులైలో భానుకు చెందిన ఈ స్టార్టప్‌కు లైట్‌స్పీడ్ వెంచర్స్ నుంచి 2 మి. డాలర్ల సీడ్ ఫండింగ్ అందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భాంజూ.. ఇన్వెస్టర్ల నుంచి 20 లక్షల డాలర్ల (సుమారు రూ.15 కోట్లు) పెట్టుబడులు ఆకర్షించింది. వెంచర్ క్యాపిటల్ సంస్థ లైట్స్పీడ్తో పాటు పలువురు ఏంజిల్ ఇన్వెస్టర్లు ‘భాంజూ’ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ నిధులతో ఈ సంస్థ త్వరలో తన కార్యకలాపాలను అమెరికా, కెనడా, యూకే, పశ్చిమాసియా దేశాలకూ విస్తరించనుంది. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమంది విద్యార్థులపై ప్రభావం చూపిందని భాను ప్రకాశ్ అంటారు. 17 ఏళ్ల వయసులో ‘ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్’గా జొన్నలగడ్డ భానుప్రకాశ్ పేరు పొందారు. 4 ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను తిరగరాశారు.