వెనక్కి తగ్గని జొన్నవిత్తుల.. ‘మానవజాతి మడి కట్టుకుంది…’
సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన పాట సంచలనంగా మారింది. ‘మానవ జాతి మడి కట్టుకుంది’ అంటూ కరోనా నేపథ్యంలో వచ్చిన పాటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్ణ వ్యవస్థను తీసుకువస్తూ విషం చిమ్మారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా జొన్నవిత్తుల ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను రాసిన పాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇది లౌకికపరమైన విషయం అని ఇప్పటికీ తాను రాసిన పాటకు కట్టుబడి ఉన్నానన్నారు. బ్రహ్మణులు పాటించే మడిలాంటి ఆచారాలను ఇప్పుడు ప్రపంచం అంతా పాటిస్తుందని మరోసారి స్పష్టం చేశారు.
తన పాటలో అంటరానితనం, కుల వివక్షతను తాను వంత పాడలేదని పేర్కొన్నారు.‘మానవ జాతి మడికట్టుకుని ఉందని నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.ప్రస్తుతం కరోనా వల్ల ఎవరూ ఎవర్ని తాకడం లేదు. ఇదే కదా మడి అంటే. మరణ శయ్యపై మడికట్టుకుని ఉంది మానవజాతి. ఒకరినొకరు దగ్గరగా రాకుండా చూడటమే మడి అంటే. అదే శాస్త్రవేత్తలు కూడా పాటించారు. మీరు కూడా పాటించడి అని నా పాట రూపంలో చెప్పా’ అంటూ క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఎవరైనా శిక్ష వేసినా సిద్ధంగా ఉన్నానంటూ స్పష్టం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.