హిమాలయ పర్వతాల కిందన్న జోషిమఠ్ పట్టణంలో ఇళ్లు, వీధులు బీటలు వారడంతో వేలమందిని ఖాళీ చేయించారు. భూగర్భంలో అసాధారణ కదలికలు, ప్రకృతి విధ్వంసం వల్ల అక్కడ నేల కుంగిపోతోందని, త్వరలోనే పట్టణం పాడుబడిపోతుందని అంచనా వేస్తున్నాయి. అంత తీవ్రత లేకపోయినా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి మండలంలో కొన్ని చోట్లు నీట బీటలు వారుతోంది. జనం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బితుకుబితుకుమంటున్నారు. కొన్ని రోజులుగా భూప్రకంపనలు వరసగా సంభవిస్తున్నాయి.
రాతన గ్రామంలో సోమారం రాత్రి పదిహేను ఇళ్లు పగుళ్లు బారాయి. జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. సిమెంట్ రోడ్లు కూడా బీటలు వారాయి. తెల్లవారుజామున మరోసారి భూమి కంపించింది. ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడం లేదని, అధికారులు సర్వే చేసి పూర్తి వివరాలు చెప్పాలని కోరుతున్నారు. తుగ్గలి గ్రామంలోనూ పదిళ్లు పగుళ్లు బారాయి. పోస్టాఫీసు వీధులోని ఈ ఇళ్లన్నీ ఒకే సమయంలో నెర్రెలు విచ్చాయి. సిమెంటు రోడ్డు కూడా దెబ్బతినింది. పైపు లైన్లు పగిలి మంచినీరు బయటికి చిమ్మింది. ఇళ్లలోకి వెళ్లాలంటే భయంగా ఉందని, అధికారులు తమకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.