పదనిసల ఈ పిల్ల! - MicTv.in - Telugu News
mictv telugu

పదనిసల ఈ పిల్ల!

August 3, 2017


బొమ్మలో కాదుగానీ దీనికి ముందూ తర్వాతా చిన్నారిని చూస్తే మీ హృదయం ద్రవించిపోతుంది. చేతులు చాపే అభాగ్యులు, నిస్సహాయులు, అధోజగత్ సహోదరులెవరిని చూసినా మనసు కలుక్కుమంటుంది. చిత్రమేమిటంటే మన కళ్లలో ప్రతిఫలించే భావాలను వాళ్లూ గ్రహించగలుగుతారు. కానీ బయటపడరు.

మనకిష్టం లేదని వాళ్లకు తెలుసు. కానీ కిమ్మనరు. మనవి జాలిచూపులని తెలుసు. కానీ క్షమిస్తారు. మనం విదిల్చే కాసులకు మనలోనే తృప్తిల్లే ఏవో అజ్ఞాత ఆదర్శాలకూ వాళ్లు  నిందించరు. కానీ సతాయిస్తారు.

రూపాయో రెండ్రూపాయలో ఇచ్చేదాకా విసిగిస్తారు. అయితే, కొన్నిమార్లు తమనూ మననీ మరచిపోయి వాళ్లూ గెంతులేస్తారు. ఈ పిల్ల అలాంటిదే.

+++

రింగ్ ఆఫ్ ట్రూత్ అంటాడు సత్యజిత్ రే – సాంగ్ ఆఫ్ ది రోడ్-పథేర్ పాంచాలి గురించి.

సత్యం కాదు, ధర్మం నాలుగు పాదాల చెంత నిమ్మళంగా ఒకేచోట కేంద్రీకృతమైనప్పుడు ఇలాంటి చిత్రాలే అధికంగా కానవస్తాయి. అలా అని నిత్యనృత్యం  ఆగిపోతుందా? లేదు. అదే ఇక్కడి విశేషం.

భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఒకానొక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద – వాహనాలు, అందులోని బడాబాబులతో నిమిత్తం లేకుండా చిన్నగా నృత్యం చేస్తున్న ఈ దృశ్యం అప్రమేయంగా, అనాలోచితంగా చిందులేసే వ్యధార్థ మానవుడి హృదయ సంగీతానికి  తొలి అడుగు అనే అనిపిస్తుంది. ‘తొలి అడుగు’ అనడం ఎందుకూ అంటే, ఏమో! ఆ పాప పెద్దయినాక ఏమవుతుందో! మానవేతిహాసంలో ఆ ఎద ఎలాంటి స్వరాలు సంకలనపరుస్తుందో! అందుకు మనని సంసిద్ధం చేయడంలో భాగమో ఏమో, ఈ పిల్ల పదనిసలు.

 

~ కందుకూరి రమేష్ బాబు