Jr. NTR reacted to the name change of NTR Health University on Twitter
mictv telugu

జగన్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఫైర్.. పేరు మార్చి చెరిపివేయలేరంటూ..

September 22, 2022

విజయవాడలోని ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్చుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. సీఎం నిర్ణయాన్ని ఖండిస్తున్నామని ఇప్పటికే ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాజాగా ప్రముఖ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఈ విషయంపై ట్వీట్ చేశారు. ‘‘ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదు. పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్‌ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజభవన్‌కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. వైద్యరంగం అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, వైద్యరంగానికి ఆయన చేసిన సేవలకు అనుగుణంగా 1998లో తాను సీఎంగా ఉండగా హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్ అని పేరు పెట్టామన్నారు. హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు అనైతికమన్నారు. ఎన్టీఆర్‌కు జరిగిన అవమానం తెలుగు జాతికి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.