హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి బాలిక వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
కారులో ప్రయాణిస్తున్న నిందితుల వీడియోలను సర్క్యులేట్ చేసిన పాతబస్తీకి చెందిన ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధి సుభాన్‌ను అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ మీడియా పేరుతో సుభాన్.. గ్యాంగ్ రేప్ బాధితురాలు నిందితులతో కలిసి కారులో ఉన్న వీడియోలను లీక్ చేయడంతో పాటు వైరల్ చేశారని పోలీసులు గుర్తించారు. సుభాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనికి వీడియోలు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. మైనర్ బాలిక వీడియోలు బయటికి రావడం వెనుక ఎవరున్నారు.. ఎందుకు వైరల్ చేశారు.. కావాలనే చేశారా లేక తమ మీడియా ప్రమోషన్ కోసం ఇలా చేశారా అన్న కోణంలో సుభాన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈకేసుకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం.