జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ నిందితులు ఘటన జరిగిన తర్వాత తప్పించుకోవడానికి ముందే ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. అత్యాచారం మే 28న జరుగగా మూడు రోజుల తర్వాత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు స్కెచ్ వేశారు. వెకేషన్ కోసం గోవా వెళ్తున్నామని ఇంట్లో వారికి చెప్పి కర్ణాటకకు వెళ్లిపోయారు.
తమ సెల్ ఫోన్లను మాత్రం పోలీసులను తప్పుదోవ పట్టంచడానికి గోవాకు పంపారు. అత్యాచారం చేసిన ఇన్నోవా కారుకు ఇంకా నెంబరు రాలేదు. టీఆర్ నంబరే ఉంది. దాని మీద ప్రభుత్వ వాహనం అన్న స్టిక్కరు ఉంది. పారిపోయే ముందు నిందితులు ఈ కారును దాచిపెట్టారు. హైదరాబాదు నుంచి పారిపోయేందుకు ఐదుగురు నిందితులు ఐదు దార్లలో వెళ్లారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లయిన నిందితులు ఇంకా చాలా మార్గాలను తప్పించుకోవడానికి వాడుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఈ అంశం రాజకీయ రంగు పులుముకోవడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీలు అధికార పార్టీమీద దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ నేత రఘునందన్ రావు అయితే పోలీసులు ఇంతవరకు బయటపెట్టలేని ఫోటోలను మీడియా సమక్షంలో ప్రజలకు చూపించారు. అంతేకాక, నిందితులను దేశం దాటించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీంతో ప్రజలతో పాటు పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా షాకయ్యాయి. నిందితులను ప్రభుత్వ పెద్దలు కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను జనం నమ్మకముందే తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.