జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పోలీసులు వేధింపులంటూ ఆత్మహత్యాయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పోలీసులు వేధింపులంటూ ఆత్మహత్యాయత్నం

September 26, 2020

Jubileehills MLA, police.. teenager commits incident

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పోలీసులు వేధించారని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బోరబండకు చెందిన నీలం భార్గవ రామ్‌ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో  ప్రజల సమస్యలపై యాక్టివ్‌గా ఉండే భార్గవ.. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆస్తుల వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కింద పిటిషన్ దాఖలు చేశాడు. ఆలయ భూముల పరిరక్షణకు కూడా కృషిచేస్తున్న భార్గవ ఇందిరానగర్‌లో హనుమాన్ దేవాలయ భూ వివాదం పరిష్కారానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండు  రోజుల క్రితం ఎమ్మెల్యే మాగంటి ఆదేశాల మేరకు స్థానిక ఎంఆర్‌ఓ ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా ప్రకటించే బోర్డు ఏర్పాటుచేశాడు. 

దీంతో ఎమ్మెల్యే జోక్యంపై భార్గవ రామ్ నిరసన వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశాడు. ఈ వివాదానికి సంబంధించి పోలీసులు భార్గవ్‌రామ్‌ను, అతని సోదరుణ్ని విచారించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకే పోలీసులు తనను వేధించారని ఆరోపిస్తూ భార్గవ్‌ రామ్‌ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని సనత్ నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది కాలంగా ఎస్ఆర్ నగర్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని భార్గవ్ బంధువులు ఆరోపిస్తున్నారు. కులం పేరుతో దూషించారని.. వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడంతోనే ఆందోళనకు, ఆవేదనకు గురై భార్గవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. సదరు సీఐ, ఎమ్మెల్యే మాగంటిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బాధిత యువకుడు డిమాండ్ చేస్తున్నాడు.