హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జువైనల్ జస్టిస్ బోర్డు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన వాదనతో జువైనల్ జస్టిస్ బోర్డు ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. 23న మరో మైనర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా…వారిలో ఒకరు మేజర్ కాగా, మిగిలిన ఐదుగురు మైనర్లే. వీరిలో నలుగురు మైనర్లు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ జువెనైల్ జస్టిస్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ బెయిల్ పిటిషన్లపై మంగళవారం నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే కేసు దర్యాప్తు దశలో ఉన్నందున మైనర్లకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది బోర్డు ఎదుట వాదనలు వినిపించారు. సొసైటీలో పలుకుబడి ఉన్న మైనర్ల తల్లిదండ్రులు దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉండొచ్చని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారం విచారణ వాయిదా వేసిన జువైనల్ జస్టిస్ బోర్డు పిటిషన్లు తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.