జైభీమ్ సీన్ రిపీట్.. ఆదోని పోలీసులకు చెమటలు పట్టించిన జడ్జీ - MicTv.in - Telugu News
mictv telugu

జైభీమ్ సీన్ రిపీట్.. ఆదోని పోలీసులకు చెమటలు పట్టించిన జడ్జీ

September 27, 2022

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పోలీసుల తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళ నటుడు సూర్య నిర్మించి నటించిన జైభీమ్ సినిమాలోని సీన్ ఇక్కడ రిపీటయింది. ఆ సినిమాలో పోలీసులు ఒక అమాయకుడిని తప్పుడు కేసులో ఇరికించి చిత్ర హింసలు పెట్టి చంపేస్తారు. ఇక్కడ చంపలేదు కానీ, ఏకంగా జడ్జీనే ఏమార్చబోయి అడ్డంగా దొరికేశారు. కేసులలో సంబంధం లేని వాళ్లను ఎలా ఇరికిస్తారో ప్రత్యక్షంగా చూపించి బోర్లా పడ్డారు. కర్ణాటక నుంచి అక్రమంగా వస్తున్న మద్యాన్ని అరికట్టామని, నిందితుడు ఇదిగో అంటూ ఓ వ్యక్తిని పోలీసులు జడ్జీ ముందు ప్రవేశ పెట్టారు.

సాయంత్రం వరకు ఆ వ్యక్తిని తమ వద్దే ఉంచుకున్న పోలీసులు తర్వాత మరో కేసులో అదే నిందితుడిని తీసుకొచ్చి సిరిగప్ప క్రాస్ వద్ద పట్టుకున్నామని చూపించారు. కానీ, నిందితుడిని గుర్తించిన జడ్జీ పోలీసులను ప్రశ్నించడంతో అవాక్కైన పోలీసులు ఏం జవాబు చెప్పాలో తెలియక నీళ్లు నమిలారు. దీంతో మరింత ఆగ్రహం చెందిన జడ్జీ.. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలతో ఆదోని పోలీస్ స్టేషనులో తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.