మహిళ క్రికెట్లో జులన్ గోస్వామి అరుదైన రికార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

మహిళ క్రికెట్లో జులన్ గోస్వామి అరుదైన రికార్డ్

March 16, 2022

cricket

ఐసీసీ మహిళా ప్రపంచకప్‌ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచులో భారత మహిళా క్రికెట్ సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఒక వికెట్ పడగొట్టడంతో అరుదైన రికార్డ్ సాధించింది. దీంతో మహిళా క్రికెట్లో అరుదైన ఘనతను సాధించిన జులను ఐసీసీ, ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అభినందించింది. ‘ఇంత గొప్ప ఘనత సాధించిన జులన్ గోస్వామికి శుభాకాంక్షలు. క్రికెట్లో ఆమె లెజెండ్. గొప్ప పోరాట యోధురాలు. యువ క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచావు’ అని ఇంగ్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది.

అంతేకాకుండా ఇప్పటి వరకు 190 వన్డేలు ఆడిన జులన్.. 250 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బౌలర్ ఫిట్జ్ ప్యాట్రిక్ (180 వికెట్లు) రెండు, వెస్టిండీస్ పేసర్ అనిసా మహమ్మద్ (180 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్‌లో జరిగిన లీగ్ మ్యాచులో భారత జట్టు ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 134 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (35), వికెట్ కీపర్ రిచా ఘోష్ (33), జులన్ గోస్వామి (20) మినహా.. మిగతా ప్లేయర్లంతా విఫలమయ్యారు.

అనంతరం, స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. హీథర్ నైట్ (53), నటాలీ సివర్ (45) రాణించడంతో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచులు ఆడిన భారత జట్టు రెండింట్లో నెగ్గి, మరో రెండింట్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.