Junagadh hit and run case takes a curious turn, accused arrested
mictv telugu

గలీజ్ పని బయటపెడుతుందని యాక్సిడెంట్‌తో చంపాడు.. వీడియో

September 15, 2022

తన వివాహేతర సంబంధాన్ని ఎక్కడ బయటపెడుతుందోనన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఓ అమాయకురాలిని కారుతో ఢీకొట్టి చంపాడు. అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు అడ్డంగా బుక్కయ్యాడు. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో గత శనివారం ఓ కారు వేగంగా మహిళను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే కన్నుమూసింది. డ్రైవర్‌ మాత్రం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తొలుత ఇది ప్రమాదమని అందరూ భావించారు. అయితే మృతురాలి సోదరుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం బయటకు వచ్చింది.

అతడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. సంఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజ్ను నిశీతంగా పరిశీలించి చివరకు ఇది హత్యే అని తేల్చారు. వెంటనే నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అదే ప్రాంతంలోని ఓ గెస్ట్‌ హౌస్‌లో దాగి ఉన్న నిందితుడు ఆదిల్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతనికి ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం.. మృతురాలికి తెలియడం వల్లే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమె ఈ విషయాన్ని ఎక్కడ బయటపెడుతుందో అన్న భయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఆదిల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.