ఒకపక్క ధాన్యరాశులు, మరోపక్క ఆకలి చావులు. ఒకపక్క ఆకాశ హర్మ్యాలు, మరోపక్క చివికిన పూరి గుడిసెలు. 75 ఏళ్ల స్వతంత్రభారతం ఎన్ని సాధించినా పేదల కష్టాలు తీరడమే లేదు. కనీస నిత్యావసరాలకు నోచుకోక కోట్లమంది దుర్భర దారిద్ర్యంతో అల్లాడుతున్నారు. పిడికెడు తిండే కరువైన బడుగులకు పాలు ఖరీదైన సరుకే. గుక్కెడు పాల కోసం గుక్కబట్టి ఏడ్చే పసికందులు బస్తీల్లో, మురికివాడల్లో వందలమంది కనిపిస్తారు. కాఫీ చుక్క కోసమో, కాసిని టీనీళ్ల కోసమో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే శ్రమజీవుల సంగతి చెప్పాల్సిన పనిలేదు.
దేవుడే దారి చూపాడు..
ఆ పెద్దాయన ఇలాంటి దృశ్యాలెన్నో చూశాడు. కడుపు తరుక్కుపోయింది. సాయం చేద్దామంటే తన పరిస్థితి అంతంత మాత్రమే. కానీ ఏదో ఒకటి చేద్దామన్న సంకల్పం తీసుకున్నాడు. ఓ రోజు దేవుడే తనకు దారి చూపాడని ఆశతో బయల్దేదారాడు. ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుని తన డొక్కు సైకిల్ ఎక్కి ఊరిల్లోకి వెళ్లాడు. ఆలయాల్లో దేవతలకు అభిషేకం తర్వాత వృథాగా పోయే పాలను జాగ్రత్తగా జాలీ పెట్టి తన డబ్బాల్లో నింపుకున్నాడు. వాటిని నేరుగా మురికివాడలకు, నిరుపేదల బస్తీలకు తీసుకెళ్లి తలా ఇన్నని అందరికీ పంచాడు. అప్పట్నుంచీ కొన్ని ఏళ్లుగా అదే అతని పని. ఆ తాతయ్య సైకిల్ చూడగానే పసిపిల్లలు కేరింతలు కొడతారు. పెద్దలు మురిసిపోతారు. ‘‘దేవుడెలా ఉంటాడో తెలియదు. మా పెద్దాయన దేవుడి తర్వాత దేవుడి అంతటివాడు,’’ అని అటారు. దేవుడు పంపిన పాలమనిషిని అని కృతజ్ఞత చూపుతారు.
ఎక్కడ?
గుజరాత్‌లోని జునాగఢ్ లో తిరుగుతున్నాడు ఈ పాలపెద్ద. తన పేరు కూడా చెప్పడానికి ఇష్టపడని ఈ తాత వయసు 70 ఏళ్లకుపైగానే. పేరు చెప్పయ్యా అంటే ‘ఇండియన్’ అంటాడు. ఆలయాల్లో వృథాగా పోయే పాలను సేకరిస్తూ పంచడమే పనిగా పెట్టుకున్న ఆయన తను గొప్ప పనేమీ చేయడం లేదని, సాటి మనిషిగా చిరుసాయం మాత్రమే చేస్తున్నానని అంటారు. ఎండవానలను పట్టించుకోకుండా, సెలవు అన్నదే లేకుండా ప్రతిరోజ పాలు పంచుతుంటారు. పెద్దాయనను ప్రశసింస్తున్న ఆయన సైకిల్‌పై మువ్వన్నె జెండా రెపరెపలాడుతుంటూ ఉంటుంది.