కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా… ఇప్పుడే తొందరపడొద్దు. జూలై ఫస్ట్ దాకా ఆగండి… ఎందుకంటే జూన్ చివరి వరకు ఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయట. ఇప్పటికే పలు ఈ-కామర్స్ సైట్లతోపాటు రిటెయిల్ మార్కెట్లోనూ వ్యాపారులు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఫోన్లను అమ్ముతున్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జీఎస్టీ బిల్లును జూలై 1 నుంచి అమలు చేయనుంది. దీని ప్రకారం జూలై 1 నుంచి మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. అందుకు కారణం వాటి విడి భాగాలపై పన్నును పెంచడమే. దీంతో ఫోన్ తయారీ ఖర్చు పెరిగి తద్వారా ఫోన్ల ధరలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో పెరిగిన ధరలు అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వ్యాపారులు తమ వద్ద ఉన్న పాత స్టాక్ ను ఇప్పటికే క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. దీంతో ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. రెండు నెలలుగా ఫోన్ల షిప్మెంట్లలో తగ్గుదల కనిపించడాన్ని బట్టి చూస్తే విక్రయదారులు ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునే పనిలో పడినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.
జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి రానున్నందున జూన్ చివరి వారంలో వ్యాపారులు మరిన్ని ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆ ఒక్క వారంలోనే పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించవచ్చు. సో అప్పటి వరకు ఆగితే భారీ తగ్గింపు ధరలతో ఫోన్లను కొనొచ్చు.