జూనియర్ బాలయ్య మృతి.. బాలకృష్ణ భావోద్వేగం.. - MicTv.in - Telugu News
mictv telugu

జూనియర్ బాలయ్య మృతి.. బాలకృష్ణ భావోద్వేగం..

October 18, 2019

Junior Balayya passedaway .. Balakrishna write a Emotion letter ..

‘నీ ఇంటికొచ్చాను.. నీ నట్టింటికొచ్చాను.. రా తేల్చుకుందాం’ అని నందమూరి బాలకృష్ణలా డైలాగులు విసిరే జూనియర్ బాలయ్య అలియాస్ గోకుల్ ఇకలేడు. డెంగీ వ్యాధితో బాధపడుతూ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గోకుల్ కన్నుమూశాడు. చిన్న వయసులోనే అచ్చం బాలయ్యలా డైలాగులు పలకడం, హావాభావాలు పలికించడంతో చాలా ఫేమస్ అయ్యాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే ‘డ్రామా జూనియర్’ కార్యక్రమంలో అచ్చంగా బాలకృష్ణలా గోకుల్ చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఎంతో ఫిదా అయ్యారు. ఇంత చిన్న వయసులో సినిమా డైలాగులను అలవోకగా పలికే అతని ఆయువు ఇంత త్వరగా తీరిపోవడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

గోకుల్ మరణవార్త తెలిసి బాలకృష్ణ చలించిపోయారు. ‘నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలిచివేసింది. గుండె బరువెక్కింది. ఆ చిన్నారి డైలాగులు చెప్పే విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ బాలయ్య లేఖ విడుదల చేశారు. అతని మరణవార్త తెలిసి సోషల్ మీడియాలో చాలామంది తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు వుంటుంది అనుకున్న గోకుల్ ఇలా అర్థాంతరంగా మనల్ని వదిలివెళ్ళడం బాధాకరం అంటూ నివాళులు తెలియజేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గోకుల్ స్వస్థలం. తండ్రి యోగేంద్రబాబు, తల్లి సుమాంజలి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టీవీ షోలతో గోకుల్ ఫేమస్ అయ్యాడు.