జైలుకెళ్లడానికి రెడీగా ఉన్నా, నేతాజీ, సావర్కర్ బాటలో.. కంగన  - MicTv.in - Telugu News
mictv telugu

జైలుకెళ్లడానికి రెడీగా ఉన్నా, నేతాజీ, సావర్కర్ బాటలో.. కంగన 

October 23, 2020

Just like Savarkar,Laxmi Bai,Bhadur Shah Zafar,Neta ji.. Kangana Tweet.jp

బాలీవుడ్ క్వీన్ మరోమారు మహారాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని.. నేతాజీ, సావర్కర్, ఝాన్సీరాణి బాటలో నడుస్తానని ట్విటర్‌లో పేర్కొంది. కంగనాపై క్రిమినల్ కేసు నమోదై వారం కూడా గడవక ముందే ఆమె మరో కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ముంబై పోలీసులపై చేసిన విమర్శల కారణంగానే ఆమెపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. స్థానిక లాయర్ కంగనాపై మొదటి కేసును నమోదు చేశాడు. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కంగనా ముంబై పోలీసులను నిందించిందని, అది చట్టరీత్యా నేరమని ఆమెపై ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా  దేశ పరువును కంగనా బజారుకీడ్చిందని.. పోలీసులు, ప్రభుత్వ అధికారుల విలువను తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

అయితే కంగనా దీనిపై తనదైన శైలిలో సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది. ‘నేను ఓ ఫాసిస్ట్ ప్రభుత్వంతో పోరాడుతున్నాను. క్యాండిల్ మార్చ్ గ్యాంగ్, అవార్డ్ వాపసీ గ్యాంగ్ చూడండి ఫాసిజాన్ని ఎదుర్కుంటే ఇలా అవుతుంది. మీకేం పట్టదు, మిమ్మల్ని ఎవరూ అడగరు కూడా. కానీ నన్ను చూడండి ప్రశ్నించినందుకు మహరాష్ట్రలో ఫాసిస్ట్ ప్రభుత్వంతో పోరాడుతున్నాను. జై హింద్, నా జీవితానికి ఒక అర్ధాన్ని ఇస్తున్నాను. మోసపూరిత ప్రభుత్వంతో పోరాడుతున్నాను’ అని కంగనా ట్వీట్ చేసింది. అంతే కాకుండా తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్దంగా ఉన్నానని తెలిపింది. ఇది వీర్ సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ రాణి వంటి గొప్పవారి వారసత్వం అనుకుంటానని తెలిపింది. తన నిర్ణయాల పట్ల మరింత నమ్మకం కలుగుతోందని.. జైలుకు వెళ్లి తన ఆదర్శ వీరుల లాగే ఉంటానని కంగనా స్పష్టంచేసింది.