ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ కాసేపటిక్రితం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మూడో న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ గుర్తింపు పొందారు. ఈ ఏడాది జనవరిలోనే ఆయన పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ ట్రిపుల్ తలాక్, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో ఉన్నారు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తిగా ఉన్నారు.