ఢిల్లీ అల్లర్లు.. జడ్జి బదిలీకి ఆయన తీర్పులే కారణమా?  - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ అల్లర్లు.. జడ్జి బదిలీకి ఆయన తీర్పులే కారణమా? 

February 27, 2020

Justice muralidhar.

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. అయితే పోలీసుల వైఫల్యం వల్లే అల్లర్లు జరిగాయని విమర్శించిన ఢిల్లీ హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ ఎస్ ముర‌ళీధ‌ర్‌ను పంజాబ్-హరియాణా హైకోర్టుకు రాత్రికి రాత్రే బదిలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీలో 1984 నాటి ప‌రిస్థితులు పున‌రావృత్తం కాకూడదన్న మురళీధరన్‌ను బుధ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు బదిలీ చేశారు. అంత హడావుడిగా పంపించడానికి కారణం పోలీసులను కాపాడేందుకేనని ఆరోపణలు వస్తున్నాయి. అయితే సాధారణ పరిపాలనలో భాగంగానే బదిలీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ జస్టిస్ మురళీధర్ కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉంటారని, అందుకే ప్రభుత్వం కొన్ని సమస్యల నుంచి తప్పించుకోడానికి ఆయనపై బదిలీ వేటు వేసిందని అంటున్నారు. పోలీసులకు, అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గతంలో తీర్పులివ్వడం దీనికి కారణమని విపక్షాలు మండిపతున్నాయి. 

జస్టిస్ మురళీధరన్ ఇచ్చిన తీర్పులు 

స్వలింప సంపర్కం నేరం కాదని 2009లో తీర్పు చెప్పిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనంలో జస్టిస్ మురళీధర్ కూడా ఉన్నారు. దేశంలో హోమోసెక్సువాలిటీని నేరం కాదని ఓ కోర్టు ప్రకటించడం అదే తొలిసారి. 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు. అలాగే, 1987 నాటి హసీంపురా ముస్లింల ఊచకోత కేసులో 16 మంది పోలీసులకు శిక్ష విధించిన బెంచీలోనూ జస్టిస్ మురళీధరన్ ఉన్నారు. సాయుధ బలగాలు.. ఒక వర్గానికి చెందిన నిరాయుధులను, అమాయకులను కాల్చి చంపారని జస్టిస్ మురళీధర్, జస్టిస్ గోయెల్ ల ధర్మాసనం తప్పుబట్టింది. ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీ విధానాలను విమర్శించే గౌతమ్ నవలాఖా వంటి మేధావులకు కూడా జస్టిస్ మురళీధరన్ బెయిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఏఏ అల్లర్ల కేసుల్లోనూ ఆయన పోలీసులకు వ్యతిరేకంగా తీర్పులిచ్చే అవకాశముందని, అందుకే ఆయనను తప్పించారని భావిస్తున్నారు.