నేను కేసీఆర్ లేనందువల్లే ఆంధ్రాకు ఈ దుస్థితి : కేఏ పాల్ - MicTv.in - Telugu News
mictv telugu

నేను కేసీఆర్ లేనందువల్లే ఆంధ్రాకు ఈ దుస్థితి : కేఏ పాల్

April 13, 2022

 

 

తెలంగాణలో అధికార పార్టీ, గవర్నర్‌ల మధ్య పరోక్ష యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలవడం ప్రాధాన్యం సంతరించుకొంది. గవర్నర్‌తో భేటీ తర్వాత కేఏపాల్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై, ఆంధ్ర ప్రదేశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం. ఏడేళ్లలో 8 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇంత అవినీతి చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఒకప్పుడు తననెంతో గౌరవించిన కేసీఆర్‌కు ఇప్పుడు కళ్లు నెత్తికెక్కాయి. కేసీఆర్ అక్రమపాలనను అంతం చేయడానికే అమెరికా నుంచి వచ్చాను. రాబోయే ఎన్నికల్లో 30 సీట్లకు మించి రావని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు. రేపో మాపో కేసీఆర్ అరెస్టు ఖాయం. సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఈ భయంతోనే కేసీఆర్ డ్రామా ఆడుతున్నార’ని విమర్శించారు. అంతేకాక, ‘నేను విశాఖపట్టణం నుంచి, కేసీఆర్ విజయనగరం నుంచి వచ్చారు. ఇద్దరం ఆంధ్రాలో లేనందువల్ల ఏపీ అంధకారమైపోయింది. సీఎం జగన్ దారుణంగా విఫలమయ్యారు. ఇంకో ఇరవై ఏళ్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏపీ అప్పు తీరదు’అని వ్యాఖ్యానించారు.