కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం భేటీ గురించి మీడియాతో మాట్లాడిన పాల్ ‘ఇటీవల నాపై జరిగిన దాడి వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని షా గారితో చెప్పాను. అలాగే తెలుగు రాష్ట్రాల అప్పుల గురించి తెలియపరిచాను.
ఏపీ 8 లక్షల కోట్లు, తెలంగాణ నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేశాయి. ఇలాగే చేసుకుంటూ పోతే మన దేశం మరో శ్రీలంకలా మారుతుందని వివరించాన’న్నారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న అవినీతిని తన జీవితంలో చూడలేదని ఆరోపించారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదనీ, కానీ, అమిత్ షా అడగ్గానే ఇచ్చారన్నారు. ప్రధాని మోదీని కలవాలని షా సూచించారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.