సీఎం జగన్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్.. తన పార్టీలో చేరితే..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హల్ చల్ చేస్తున్నారు. తన పర్యటనల్లో భాగంగా విజయవాడ వచ్చిన పాల్.. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో.. ఇవాళ జగన్, చంద్రబాబు, పవన్, మోడీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఏపీ రాజకీయ పార్టీల అధినేతల్ని తన పార్టీలోకి వచ్చేయాలని పాల్ కోరారు. నవరత్నాల పథకాలకు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని.. అదే సీఎం జగన్ తమ పార్టీలో చేరితే అన్నీ తానే చూసుకుంటానని కేఏ పాల్ భరోసా ఇచ్చారు. జగన్ తనను కలవడానికి ఆసక్తి చూపడం లేదని.. సీక్రెట్‌గా అయినా ఆహ్వానిస్తే వెళ్లి కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పాల్ అన్నారు.
జగన్‌ను చంద్రబాబు ఏడిపించారని.. అందుకే ఇప్పుడు అసెంబ్లీలో ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ తనకు శత్రువులు కాదని పాల్ చెప్పారు. ఐతే పొత్తుల విషయంలో పవన్ వైఖరి మార్చుకోవాలని.. ఈ అన్నయ్యతో కలిస్తే అంతా మంచే జరుగుతుందంటూ జనసేనానికి ఆఫర్ ఇచ్చారు. తానంటే పవన్‌కు గౌరవమన్న పాల్.. తమ్ముడు ముందుకు వస్తే కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వయసు మళ్లిందని, ఇప్పుడైనా తనకు మద్దతు ఇవ్వాలన్నారు. తాను ఐదేళ్లల్లో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానన్నారు. కాబట్టి టీడీపీ కార్యకర్తలు కూడా ఆలోచించి తనకు మద్దతు ఇవ్వాలన్నారు. చంద్రబాబు తెలుగు ప్రజల గురించి మంచి నిర్ణయం చేయండన్నారు.
ఈ దేశం మరో శ్రీలంక లాగా మారుతుందని, మోడీ 76లక్షల కోట్లు అప్పు చేశారని పాల్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో మార్పు కోసం ప్రజలంతా కలిసి రావాలన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందని తాను ముందే చెప్పానని.. న్యాయ వ్యవస్థ గురించి కూడా నలుగురు న్యాయమూర్తులు బయటకు వచ్చి మాట్లాడారంటూ ఆయన గుర్తు చేశారు. ఈవీఎంలతో ఎన్నికలకు వెళ్తే దేశంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందంటూ పాల్ అన్నారు. దేశంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమంటూ ఆయన చెప్పారు.