ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ బోధకుడు కేఏ పాల్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అదిరిపోయే భారీ ఆఫర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని వీడి, తన ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేగా గాని, ఎంపీగా గాని గెలిపిస్తానని హామి ఇచ్చారు. అలా గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానని ప్రకటన చేశారు. పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చి చెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ మెల్కోని వెంటనే తమ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.
ఇటీవలే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ”ఆంధ్రప్రదేశ్‌లో కుల ప్రభావిత రాజకీయాలు ఆపాలనే ఉద్దేశంతోనే గతంలో బీజేపీతో, టీడీపీతో కలిశాం. కానీ, ఈరోజు వైసీపీ కోనసీమ అల్లర్లు సృష్టించిన విధానం చాలా బాధాకరం. ప్రస్తుత రాజకీయాల్లో గుణం కాదు. కులం చూస్తున్నారు. ఇదో విచ్ఛిన్నకరమైన ధోరణి. కోనసీమ అల్లర్లను బహుజన సిద్ధాంతంపై, బహుజన ఐక్యతపై దాడిగా జనసేన చూస్తోంది. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి, ఓట్ల రాజకీయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ అందరూ కుల ప్రభావానికి లోనవుతున్నారు” అని ఆయన అన్నారు.
అనంతరం మన దేశంలో అవినీతి అనేది రాజకీయాల్లో సహజంగా మారిందని, మనమంతా ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నామని పవన్ మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భారీ ఆఫర్ ఇవ్వడం ఏపీలో హాట్ టాఫిక్‌గా మారింది.