ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 15వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, శనివారం రాజ్ ఘాట్‌లో దీక్షకు దిగారు.
అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ..”ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మౌన దీక్షకు దిగి, 3 గంటలపాటు నిరసన చేపట్టాను. గడచిన 8 ఏళ్లుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ తొక్కిపెట్టారు. రాష్ట్ర విభజన చట్టం హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగుతా. అప్పటికీ విభజన చట్టం హామీలు అమలు కాకుంటే ఆగస్టు 15 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా. తెలుగు ప్రజలు సత్తా చూపకపోతే విభజన చట్టం హామీలు అమలు కావు. అందుకే హామీలు అమలయ్యే వరకు నేను దీక్షలకు దిగుతూనే ఉంటా” అని ఆయన అన్నారు.