ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ. పాల్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 7 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. తాను వారం రోజులు అమెరికాకు వెళ్లి వచ్చే సరికి రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని పాల్ వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ సత్తా ప్రజలు చూశారని తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంలు మార్చే స్థితికి, గతికి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దిగజారాయని విమర్శించారు. డిసెంబర్ 13న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని కేఏ పాల్ వెల్లడించారు. మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడు ను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ముప్పై రోజులు అయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, ఊరేగింపులకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. వైఎస్ షర్మిల పైనా కేఏ పాల్ విమర్శలు చేశారు. షర్మిల అన్న జగన్ నాలుగేళ్ళ లో రాజన్న రాజ్యం తీసుకొని రాలేదని, రాక్షస రాజ్యం, అవినీతి రాజ్యం తీసుకొచ్చారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కేఏ.పాల్ కోరారు.