Kabul University professor tore his education certificates in live debate
mictv telugu

ఈ చదువులు నాకొద్దంటూ సర్టిఫికెట్లను చించేసిన ప్రొఫెసర్.. వీడియో

December 28, 2022

తాలిబన్ల వశమైన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం బాలికలు, యువతుల విద్యపై కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పటికే యూనివర్సిటీలలో విద్యను నిషేధించగా, ఇది క్రమంగా ఇంటర్ కాలేజీలు, స్కూళ్ల వరకు పాకుతుందనే ఆందోళన నెలకొంది. అటు ప్రభుత్వ చర్యను యువతులతో పాటు యువకులు కూడా నిరసిస్తున్నారు. బాలికలకు లేని విద్య మాకు కూడా వద్దంటూ మహిళల విద్యకు మద్ధతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాబుల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ చేసిన పని సంచలనంగా మారింది. ఓ టీవీ ఛానెల్ డిబేల్ లో పాల్గొన్న ఆయన.. తన అమ్మ, సోదరిలు చదువుకోలేప్పుడు ఈ విద్య నాకు వద్దంటూ తన డిప్లొమా సర్టిఫికెట్లను చింపేశారు. ఈ దేశం విద్యకు తగిన స్థలం కాదని ఆవేదన, ఆగ్రహం కలగలిసిన హావభావాలు ప్రదర్శించాడు. ఈ వీడియోను సామాజిక కార్యకర్త షబ్నం నసిమి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, ప్రపంచ దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

 

కాగా, అధికారం చేపట్టిన మొదట్లో తాలిబన్లు మితవాద ధోరణి ప్రదర్శించి ప్రజలను నమ్మించారు. మునుపటిలాగా పాలన అందించబోమని, ఈ సారి సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారు. షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఒకవైపు సౌదీ అరేబియా విప్లవాత్మక చర్యలతో ముందుకు వెళ్తుండగా, తాలిబన్లు మాత్రం దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇంతచేస్తున్న తాలిబన్ ప్రముఖులు.. దేశాన్ని ఆక్రమించి తమ గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు మాత్రం అప్పటివరకు ఉన్నత చదువులు చదివిన మహిళలను బలవంతంగా పెళ్లిళ్లు చేసుకున్నారు. అప్పటివరకు వారికి నిరక్షరాస్యులైన భార్యలు ఉండగా, చదువుకున్న వారిని పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలకు కూడా విద్యావంతులు అవుతారనే కారణాన్ని చూపారు. దీంతో మహిళా విద్యకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించగా, నిరాశే ఎదురైంది. ఈ ద్వంద ధోరణిని ప్రశ్నించిన వారిని మాత్రం తీవ్రంగా అణచివేస్తున్నారు.