నల్లకోడి కోసం రెండు రాష్ట్రాల ఫైట్ - MicTv.in - Telugu News
mictv telugu

నల్లకోడి కోసం రెండు రాష్ట్రాల ఫైట్

February 7, 2018

మనకు నల్లకోళ్ల సంగతి తెలుసు. వాటిని దేవతలు తినకున్నా తాము తినేందుకు బలి ఇచ్చేస్తుంటారు జనం. అయితే కాలిగోళ్ల నుంచి ముక్కువరకు దాకా.. ఈకల నుంచి చర్మం వరకు.. చివరకు రక్తం, గుడ్డు కూడా నల్లగా ఉండే కోళ్ల గురించి మీకు తెలుసా? కొందరికి తెలిసినా చాలామందికి తెలియకపోవచ్చు. ఆ కోడి పేరు కడక్‌నాథ్ కోడి.  

ఇప్పుడు ఆ కోడిపై పేటెంట్ హక్కుల కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు పందెం కోళ్లలా కాలు దువ్వుతున్నాయి. కడక్‌నాథ్ కోడిలోని విశిష్ట గుణాలే ఇందుకు కారణం. ఈ కోడి మాంసం చాలా ఆరోగ్యకరమైందని, వ్యాధులను నయం చేస్తుందని చెబుతారు. రుచిగా, కొలస్ట్రాల్ తక్కువగా ఉండే ఈ మాంసం కిలో రూ. 1200 వరకు పలుకుతుంది. గుడ్డు రూ. 50.మరి ఈ కోడి తమ రాష్ట్రానికే దక్కితే బోలెడు లాభాలు చేసుకోవచ్చనేది ఆ రాష్రాల వ్యూహం. వీటిపై తమకే హక్కు ఉందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. అయితే ఛత్తీస్‌గఢ్ సర్కారు ఇదివరకు దీనికోసం ఒక అప్లికేషన్ పడేయడంతో గొడవ రాజుకుంది. కడక్‌నాథ్ కోళ్లను ఇప్పటికే కేంద్రాలు పెట్టి ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేస్తున్నాయి ఈ రాష్ట్రాలు. కడక్‌నాథ్ కోడి మధ్యప్రదేశ్‌లోనే పుట్టిందని, అయితే తామే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం కనుక జీఐ తమకే దక్కాలని ఛత్తీస్‌గఢ్ సర్కారు డిమాండ్ చేస్తోంది. జీఐ మధ్యప్రదేశ్‌కు  దక్కితే ఈ నల్లజీవులపై ఆధారపడిన రైతులు, మహిళా సంఘాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే త్వరలో తాముకూడా కడక్‌నాథ్‌ల ఉత్పత్తిని రెట్టింపు చేసి జీఐని తామే దక్కించుకుంటామని మధ్యప్రదేశ్ చెబుతోంది.వంద గుడ్లు పెడుతుంది..

కడక్‌నాథ్‌ నాటు కోడి గుడ్డుపెట్టడంతో దిట్ట. ఒక సీజన్‌లో ఏకంగా వంద గుడ్లు పెడుతుంది. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆరునెలల వయసు నుంచే గుడ్లు పెడతాయి. వీటి మాంసాన్ని తింటే రక్తస్రావం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యలు దరిజేరవని అంటారు. వీటి మాంసంలో బి1, 2, 6, 12, సి విటమిన్లు, ప్రొటీన్లు మరెన్నో పోషకాలు ఉన్నాయి. ఎనిమియా, క్షయ, ఆస్తమాలను ఇది నివారిస్తుందని చెబుతారు.